AP Weather: రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు- అక్కడ పిడుగులు కూడా..!
ఏపీలో వాతావరణం (AP Weather) ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటివరకూ ఉక్కపోతతో అల్లాడిన జనాన్ని క్రమంగా వర్షాలు పలకరిస్తున్నాయి. రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. అలాగే పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అయా చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఆకస్మికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మిల్లీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో 27.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, గుంటూరు జిల్లా పండ్రపాడులో 24 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.














Click it and Unblock the Notifications
