కాంగ్రెస్ లోకి షర్మిల! అమరావతికి ప్రియాంక! ఏపీసీసీ ఛీఫ్ గిడుగు హింట్స్..
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు ఇవాళ స్పందించారు. ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే వైసీపీ పాలన, అమరావతి రాజధాని వంటి అంశాలపై గిడుగు తన మనసులో మాటల్ని ఇవాళ బయటపెట్టారు.
ఏపీలో జగన్ నడుపుతోంది నకిలీ కాంగ్రెస్ అని పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. వైసీపీలో జగన్ కు బానిసలుగా ఉన్న వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నారు. కాంగ్రెస్ భావజాలంతో ఉన్న వారంతా తమ పార్టీలోకి రావొచ్చన్నారు. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలున్నట్లు గిడుగు పేర్కొన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వంటి వారు సైతం షర్మిల ఎంట్రీని నిర్ధారించిన నేపథ్యంలో గిడుగు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోందని పీసీసీ ఛీఫ్ గిడుగు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉబలాటపడుతున్నాయని గిడుగు ఆరోపించారు. అలాంటి పార్టీల రాజకీయ అజెండా ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే నాలుగేళ్ల జగన్ పాలనపై బీజేపీ చేస్తున్న విమర్శలపైనా గిడుగు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం కాదని, చేతనైతే కేంద్ర దర్యాప్తు సంస్ధలతో ఎందుకు వైసీపీ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు చేయించడం లేదని గిడుగు ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల ప్రభుత్వాలకు ఓ న్యాయం, బీజేపీతో అంటకాగుతున్న పార్టీలకు ఓ న్యాయమా అని పీసీసీ ఛీఫ్ నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అమరావతికి కట్టుబడి ఉందని, ఈ మేరకు తమ జాతీయ నేత ప్రియాంక గాంధీ త్వరలోనే రాజధానిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications