గోద్రా, మణిపూర్ లో మంగళసూత్రాలు తెంచలేదా ? మోడీకి షర్మిల ఘాటు కౌంటర్...!
లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ చేస్తున్న విమర్శలపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. రాజస్తాన్ లో మోడీ మాటలు ఘోరంగా ఉన్నాయని, విషం చిమ్మేలా ఉన్నాయని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుని ముస్లింలకు ఇస్తారంటున్నారని, ఇది ఎక్కడి భాష అని ప్రశ్నించారు. రాజస్తాన్ లో మోడీ వ్యాఖ్యలు విషం చిమ్మేలా ఉన్నాయన్నారు.
బీజేపీకి మంటలు రేపడం, అందులో చలి కాచుకోవడం అలవాటని షర్మిల ఆరోపించారు. ఓ మతాన్ని రెచ్చగొట్టడం, మరో మతాన్ని అవమానించాలనేది బీజేపీకి తెలిసిన రాజకీయం అన్నారు. అందుకే బీజేపీని గతంలోనే వైఎస్సార్ వ్యతిరేకించారన్నారు. ఓ ప్రధాని స్దాయిలో ఉన్న వ్యక్తి ప్రజల్లో ఎంత విద్వేషం నింపుతున్నారో ప్రజలు గమనించాలన్నారు. గోద్రాలో మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగాయో చెప్పాలన్నారు.

ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ లో ఎన్ని మంగళసూత్రాలు తెంచారో చెప్పాలన్నారు. మోడీకి ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచన లేదన్నారు. ఆయనకు చేతనైతే తన అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు. మోడీ ప్రధాని అయినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఈ పదేళ్లలో లక్ష ఉద్యోగాలు అయినా వచ్చాయా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పారు, చేశారా అని అడిగారు. పదేళ్ల క్రితం ఏపీకి రాజధాని రావాలని, నిధులు రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, కానీ ఇప్పటికీ ఇవ్వలేని పరిస్ధితుల్లో మోడీ ఉన్నారని, రాష్ట్రానికి మోడీ పూర్తిగా అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు.












Click it and Unblock the Notifications