APPSC Group 1 results : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల-ఇలా చెక్ చేసుకోండి..
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ ఇవాళ విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలను తెలుసుకునేందుకు వీలుగా కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాల్ని ఇవాళ విడుదల చేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో తుది ఫలితాలను ఇవాళ విడుదల చేసిన కమిషన్.. వాటిని తమ వెబ్ సైట్ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచింది. దీంతో అభ్యర్ధులకు తుది జాబితా చూసుకునే వీలు కలిగింది. పరీక్షల్ని అత్యంత పారదర్శకంగా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. మెయిన్స్ లో క్వాలిఫై అయిన 220 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి వారిలో 111 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు సవాంగ్ వెల్లడించారు. అలాగే ఇందులో ఒకరిని స్పోర్ట్ కోటాలో ఎంపిక చేశామన్నారు.
గతేడాది ఏపీపీఎస్సీ మొత్తం 111 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆగస్టు 2 నుంచి 11 వరకూ ఇంటర్వూలు కూడా నిర్వహించి తుది అభ్యర్దుల జాబితాను ఎంపిక చేశారు. వీరికి ఉద్యోగాలు రానున్నాయి. వీరి వివరాలను ఇవాళ ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఏపీలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గతేడాది వెలువడిన ఈ నోటిఫికేషన్ కు కూడా నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో పోటీ కూడా ఎక్కువే ఉంది. అయితే గట్టి పోటీని ఎదుర్కొని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న వారు తుది ఫలితాలకు అర్హత సాధించారు.












Click it and Unblock the Notifications