ఏపీకి గుడ్ న్యూస్: ఈ జిల్లాల్లో జోరు వానలు
AP Rains: ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

మొన్నటివరకు మందగించిన నైరుతి రుతుపవనాలు.. ఇప్పుడు చురుగ్గా కదులుతున్నాయి. ఒడిశా, కోస్తాంధ్ర, వాయవ్య బంగాళాఖాతం గగనతలం మీదుగా విస్తరిస్తోన్నాయి. ఇవి మరింత వేగంగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 3 నుంచి 4 రోజుల పాటు రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి సైతం ఏర్పడిందని, తెలంగాణ నుండి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. వీటి ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.












Click it and Unblock the Notifications