ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం కీలక అప్ డేట్..!!
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం వేళ వడగాల్పుల తీవ్రత పెరిగింది. అదే సమయంలో ఈదురు గాలులు భీభత్సం కొనసాగుతోంది. ఈ సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణాల్లో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వడగాల్పులు హెచ్చరిక:ఏపీలో ఈ రోజు 84 మండలాల్లో.. 28న 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ అంచనా వేసింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అనకాపల్లి 1, బాపట్ల 6, తూర్పుగోదావరి 5, ఏలూరు 4, గుంటూరు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కంది. అదే విధంగా కాకినాడ 11, కోనసీమ 1,కృష్ణా 13, ఎన్టీఆర్ 15,పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

అధిక ఉష్ణోగ్రతలు: ఈ రోజు అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీలల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 - 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 -44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. గురువారం క్రిష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5 డిగ్రీల నమోదు కాగా, తిరుపతి జిల్లా గూడూరులో 44.4 డిగ్రీలలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరో మూడు రోజులు: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. అనేకచోట్ల వడగాడ్పులు వీచాయి. పలుచోట్ల ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి. ఒకటి, రెండుచోట్ల భారీవర్షం కురిసింది. ఈదురు గాలులకు మామిడి, అరటి, తమలపాకులు తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని, ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం వడగాల్పులు..సాయంత్రం సమయానికి ఈదురు గాలుల భీభత్సంతో ఇప్పుడు ఏపీలో కొనసాగుతన్న భిన్న వాతావరణంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications