ఏపీలో పిడుగులు, వర్షాలు- ఎండ తీవ్రత
Monsoon in Bay of Bengal 2025: నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్- నికోబార్ అంతటా రుతు పవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. క్రమంగా- జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే.. మే 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది.

దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఉత్తర కోస్తా రీజియన్‌లోని అంబేద్కర్ కోనసీమతో పాటు పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ చెప్పారు. మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయని చెప్పారు.
అలాగే రేపు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని విపత్తు నిర్వహణ విభాగం అంచనావేసింది. ఉష్ణోగ్రత 41 నుంచి 43 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది కూర్మనాథ్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయనగరం-16, పార్వతీపురం మన్యం-10, కాకినాడ-5, శ్రీకాకుళం-1, అల్లూరి సీతారామరాజు-1, తూర్పు గోదావరి-1 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. నేడు- ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగ నెల్లూరులో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 53.5, రాగోలులో 49.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications