ఏపీలో వడగాల్పులు తీవ్రం- ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ మంగళవారం నాడు తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ 44.4 డిగ్రీల సెల్సియస్ మేర ఎండ కాసింది. జిల్లాలోని 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది.
నేడు శ్రీకాకుళం- 19, విజయనగరం- 21, పార్వతీపురం మన్యం- 3, అల్లూరి సీతారామరాజు- 4, పోలవరం- 5, విశాఖ- 1, అనకాపల్లి- 15, కాకినాడ- 6, తూర్పు గోదావరి- 2మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వడగాల్పులు తీవ్రతరమౌతోన్నందున ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.
ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని, ఎండ తీవ్రత కళ్లపై పడకుండా ఉండేలా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించింది. కాగా నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.












Click it and Unblock the Notifications