ఏపీలో టెన్త్ పరీక్షలు రాసే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్..!
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ, దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తద్వారా వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది.
ఈ నెల 17 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.49 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం 3450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటికి చేరుకునేందుకు ఆయా విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపింది.

అయితే ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఇలా పదో తరగతి విద్యార్ధులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. బస్సు ఎక్కాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ ను కండక్టర్ కు చూపిస్తే సరిపోతుంది. అలాగే తిరుగు ప్రయాణంలోనూ ఇలాగే చేస్తే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ సౌకర్యాన్ని పదో తరగతి విద్యార్ధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications