కర్నూలు బస్సు ఎఫెక్ట్-ఏపీ సర్కార్ కు ఆర్టీసీ ఉద్యోగుల కీలక డిమాండ్స్..!
ఏపీలోని కర్నూలు జిల్లాలో నిన్న తెల్లవారుజామున జరిపిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది ప్రాణాలతో బయటపడ్డా గాయాలపాలయ్యారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన ఏపీ ప్రభుత్వం ఇవాళ హడావిడిగా ప్రైవేట్ ట్రావెల్స్ పై తనిఖీలు చేపట్టి 18 బస్సులు సీజ్ చేసింది. 289 కేసులు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగసంఘం ప్రభుత్వం ముందు కీలక డిమాండ్స్ పెట్టింది.
కర్నూలు ప్రమాదం నేపథ్యంలో ప్రెవేటు ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వం కట్టడి చేయాలని ప్రజా రవాణాశాఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. దూరప్రాంత సర్వీసులు ఆర్టీసి ద్వారానే నడపాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకుల భద్రతకు ఆర్టీసి బస్సులే విశ్వసనీయమైనవని ఉద్యోగ సంఘం తెలిపింది. అక్రమంగా తిరుగుతున్న ప్రెవేటు బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రానికి రూ.1500 కోట్లు నష్టం చేస్తున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేసింది.

ఆర్టీసి ద్వారా ఆధునిక ఏసీ, స్లీపర్ బస్సులను పెంచాలని ఈయూ కోరింది. దొంగ పర్మిట్లతో తిరుగుతున్న ప్రెవేటు బస్సులను అరికట్టాలని తెలిపింది. డబుల్ డ్రైవర్లు లేకపోవడం, స్పీడ్ లిమిట్ లేకపోవడం ప్రమాదాలకు కారణమని పేర్కొంది. "వేగం కాదు ముఖ్యం - సురక్షిత ప్రయాణమే లక్ష్యం" అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజా రవాణా సంస్ధకు ప్రజలు సహకరించాలని కోరింది. ఈ మేరకు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు ఓ ప్రకటన చేశారు.

మరోవైపు కర్నూలు బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్ లో ముమ్మర తనిఖీలు చేస్తోంది. ఈ తనిఖీల్లో ఇవాళ పలు ఉల్లంఘనలపై ఒక్కరోజే 289 కేసులు నమోదు చేసింది. అయితే ఈ తనిఖీలు రెగ్యులర్ గా చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇలా హడావిడిగా స్పందించడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications