APSRTC..స్టార్ లైనర్- ఈ కొత్త రూట్లల్లో పరుగులు
అమరావతి: వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాల స్టార్ లైనర్ 2+1 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వస్తోన్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయా సర్వీసుల సంఖ్యను మరింత పెంచనున్నారు. తిరుపతి, శ్రీశైలం, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాల మధ్య కూడా స్టార్ లైనర్ బస్సులను నడిపిస్తోన్నారు.
ప్రస్తుతం మంత్రాలయం-బెంగళూరు, కడప-విజయవాడ, కడప-హైదరాబాద్, ఒంగోలు-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం, నెల్లూరు-హైదరాబాద్, నెల్లూరు-బెంగళూరు మధ్య స్టార్ లైనర్ నాన్ ఏసీ స్టీపర్ బస్సులు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సమ్మర్ సీజన్ లో మరిన్ని నగరాలు, జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను ప్రవేశపెట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. తాజాగా విజయవాడ-మియాపూర్ మధ్య కూడా ఈ బస్సు అందుబాటులోకి వచ్చింది.

ఈ బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో రోజురోజుకూ పెరుగుతోంది. రైలు స్లీపర్ కోచ్ లను తలదన్నేలా దీన్ని డిజైన్ చేయించడం, నాన్ ఏసీ కావడం వల్ల ఛార్జీ కూడా అందుబాటులోనే ఉంటోంది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా వివిధ జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల నుంచి స్టార్ లైనర్ సర్వీసులను నడిపిస్తోన్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.ఇప్పుడు తాజాగా వాటి సంఖ్యను పెంచారు. కొత్తగా 12 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిత్తూరు- హైదరాబాద్ (బీహెచ్‌ఈఎల్), ఎమ్మిగనూరు- బెంగళూరు, కడప-విజయవాడ, కడప- హైదరాబాద్ (బీహెచ్‌ఈఎల్), నెల్లూరు- హైదరాబాద్ (బీహెచ్‌ఈఎల్), మచిలీపట్నం- హైదరాబాద్ (ఈసీఐఎల్), విజయవాడ- విశాఖపట్నం, నెల్లూరు- బెంగళూరు, చీరాల- హైదరాబాద్ (బీహెచ్ఈఎల్), ఒంగోలు- హైదరాబాద్ (బీహెచ్ఈఎల్), ఆదోని- హైదరాబాద్ (బీహెచ్ఈఎల్), విజయవాడ- హైదరాబాద్ (మియాపూర్) మధ్య స్టార్ లైనర్ బస్సులను నడిపిస్తోన్నారు.

త్వరలోనే మరిన్ని స్టార్ లైనర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అటు తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి అదనంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు నడుస్తాయి. గ్రీన్ సప్తగిరి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications