ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్, ఆర్టీసీ కొత్త సదుపాయం - ఈ సర్వీసుల్లోనే... వీరికే..!!
APSRTC కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి వద్దే ప్రయాణీకులను పికప్ చేసుకునే విధానం ప్రవేశ పెట్టింది. ఎంపిక చేసిన సర్వీసుల్లో... సంస్థ తాజాగా ఖరారు చేసిన నిబంధనల మేరకు ఈ విధానం అమలు చేయనుంది. ఇప్పటికే ప్రయాణీకులను ఆకట్టుకునేలా ఆర్టీసీ పలు విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ పికప్ విధి విధానాలను అధికారులు ఖరారు చేసారు.
ప్రయాణీకుల ఆక్యుపెన్సీ మరింతగా పెంచుకునేందుకు ఆర్టీసీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త సర్వీసులు.. సదుపాయాలతో ప్రయాణీకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆర్టీసీ విజయవాడ రీజియన్ అధికారులు మరో నిర్ణయం పైలెట్ ప్రాజెక్టు కింద అమలుకు సిద్దమయ్యారు. ఈ విధానం పైన ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన.. ఆక్యెపెన్సీకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. అందు లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన సర్వీసులు.. రిజర్వేషన్లను ఈ విధానం అమలు చేస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు దూర ప్రాంతాలకు వెళ్లే తమ అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా టికెట్లు బల్క్‌గా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు వచ్చి ఆ ప్రయాణికులను పికప్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్పందనకు అనుగుణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ
కాగా, ఇప్పటి వరకు సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి హైయ్యండ్ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ బుక్ చేసుకున్నాక.. నిర్ణీత సమయం కంటే ముందే బస్టాండ్‌కు చేరుకోవాలి. కొన్ని ప్రాంతాల నుంచి లగేజీతో పాటు సకాలంలో బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన ఆర్టీసీ.. బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ప్రయాణికుల ఇంటి వద్ద నుంచే వారిని పికప్ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. హైయ్యండ్ శ్రేణిలో ఉన్న అన్ని బస్సులను ప్రయాణికుల ఇంటి వద్దకు పంపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా విజయవాడ నగర పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయటానికి నిర్ణయించారు. బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆ సమాచారాన్ని ఆర్టీసీ అధికారులకు ముందస్తుగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం త్వరలోనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా పూర్తి విధి విధానాలు ప్రకటించనున్నారు.













Click it and Unblock the Notifications