విన్నాం, కిరణ్‌ని సమర్థిస్తున్నారా: జగన్Xయనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. జగన్ అభివృద్ధి లెక్కలు చెబుతున్న సమయంలో టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో జగన్.. టిడిపి గంటపాటు మాట్లాడితే తాము ఓపికతో విన్నామని, తమది వినకుంటే ఎలాగని ప్రశ్నించారు. తాను ఎవరినీ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, ఎవరినీ విమర్శించడం లేదన్నారు.

యనమల స్పందిస్తూ... జగన్ తనకు కావాల్సిన ఫిగర్స్ మాత్రమే తీసుకొని సభకు ఇస్తున్నారని, గ్రోత్ రేట్లు ఎప్పుడు పడిపోతుంటాయని, ఎందుకు పడిపోతుంటాయో.. అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. జగన్.. కిరణ్ ప్రభుత్వం ఫిగర్స్ చెబుతున్నారని, అలా అయితే ఆయన కిరణ్‌ను సపోర్ట్ చేస్తున్నారా చెప్పాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో డీజీపీ పర్ క్యాపిటా బాగుందని మీరు చెబుతున్నారని, మీరు కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోటీ చేశామంటున్నారని సభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు. దానికి జగన్ మాట్లాడుతూ... మీరు అక్కడ (టిడిపి వైపు) ఉన్నారా లేక సభాపతి కుర్చీలో ఉన్నారా చెప్పాలన్నారు. తాను ఈ పదేళ్ల గురించి ఎందుకు చెబుతున్నానో దానికి కారణం ఉందని చెప్పారు.
ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతారన్నారు. గత పదేళ్ల గురించి గవర్నర్ ప్రసంగంలో పదే పదే ప్రస్తావించడంతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకం లేదన్నారు.
హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (మానవాభివృద్ధి సూచి ప్రకారం) పైన జగన్ మాట్లాడుతూ... బాబు కంటే ముందు 9వ స్థానంలో ఉండగా.. 2001లో చంద్రబాబు హయాంలో 10వ స్థానంలో ఉందన్నారు.
దానికి యనమల మాట్లాడుతూ.. ప్రస్తుతం హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ ఎపి 15వ స్థానంలో ఉందని, దానికి కూడా జగన్ సమాధానం చెప్పాలన్నారు.
జగన్ మాట్లాడుతూ.. బాబు దిగిపోయాక ఎపి పరిస్థితులు దారుణంగా పడిపోయాయని చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబుకు ముందు జీడీపీ 5.72 ఉండగా, చంద్రబాబు హయాంలో 7.56, కాంగ్రెస్ హయాంలో 8.23గా ఉందన్నారు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంతకుముందు 53 మార్కులు, చంద్రబాబు హయాంలో 56, కాంగ్రెస్ హయాంలో 82 మార్కులు వచ్చినట్లు అన్నారు.
సిఎస్ఓ రేటు ప్రకారం చంద్రబాబు పాలన కన్నా వైయస్ పాలన మెరుగు అన్నారు. ఎపిలో తలసరి ఆదాయం గతంలో రూ.25,321 ఉండగా ఇప్పుడు రూ.89,214గా ఉందన్నారు. బాబు హయాంలో కరెంట్ బిల్లులు పెంచారన్నారు.












Click it and Unblock the Notifications