ఏమీ కాలేదు, కల్లబొల్లి కబుర్లే: విభనజపై అశోక్ బాబు
హైదరాబాద్/నెల్లూరు: సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పదవులు, ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారని ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. ఆయన బుధవారం నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర విభజనపై వస్తున్న పుకార్లు కల్లబొల్లి మాటలేనని, ఇంకా ఏమి కాలేదని ఆయన అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగడానికి వీల్లేదన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన తర్వాత తమ సత్తా చూపిస్తామని అన్నారు. మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని అశోక్ బాబు చెప్పారు. డిసెంబర్ 20 నుంచి మరో ఉద్యమానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

శాంతియుతంగా జరిగే ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే విధంగా ఉంటుందని అశోక్ బాబు చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసమే రాష్ట్ర విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుందని అశోక్ బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపిఎన్జీవోలు దాదాపు రెండు నెలలపాటు సమ్మె చేశారు. ఫైలిన్ తుపాను సంభవించడం వల్ల సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపి ఎన్జీవోలను కోరడంతో వారు సమ్మెను విరమించారు. విభజన జరగకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రి హామి ఇవ్వడంతో సీమాంధ్ర ఉద్యోగులు విధుల్లో చేరారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే మరోసారి మెరుపు సమ్మెకు దిగుతామని అశోక్ బాబు గతంలోహెచ్చరించారు.












Click it and Unblock the Notifications