అశోక్‌గజపతిరాజు సింప్లిసిటీకి నెటిజెన్ల ఫిదా..!!
కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకుటుంబానికి చెందిన ఆయన సామాన్యుడిలా వ్యవహరించిన తీరు అభినందనలకు కారణమవుతోంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న అశోక్‌గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఎప్పుడూ ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆయన తాజాగా ఒక ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక దిమ్మెకు ఒరిగి తోటి ప్రయాణికులతో కూర్చున్నారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో అశోక్‌గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక దిమ్మె పైన ఆయన రైలు కోసం వేచి చూస్తూ కనిపించారు. ఆయన పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ,కేంద్రంలో మోదీ ప్రభుత్వంలోనూ క్యాబినెట్ మంత్రిగా పని చేసారు. విజయనగరంలో గజపతుల బంగ్లాలో ఉంటున్నప్పటికీ సామాన్యులతోనే ఎక్కువగా సమయం గడుపుతారు. అవినీతి, వివాదాలకు ఆయన అతీతంగా వ్యవహరిస్తారనే పేరుంది.

అశోక్‌గజపతిరాజు తన సతీమణి సునీలా, కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్ర వెళ్లేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైలు వచ్చే వరకూ వీఐపీ వెయిటింగ్ రూం కాకుండా సాధారణ ప్రయాణీకులతో పాటుగా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక దిమ్మెకు ఒరిగి కూర్చున్నారు.
స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతి రాజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సామాన్యుడిలా రైల్వే స్టేషన్‌లో ఎదురుచూశారని ట్విట్టర్‌లో టీడీపీ పేర్కొంది. నిజాయతీకి, పరిపూర్ణతకు ఆయన నిదర్శనమని అభివర్ణించింది. అశోక్‌గజపతిరాజు సింప్లిసిటీని నెటిజెన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications