తుఫాను వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయాలు, ప్రయాణీకులకు సూచనలు..!!
మొంథా తుపాను ప్రభావం రైల్వే శాఖ పైన పడింది. తుఫాను తీవ్రత కారణంగా ప్రయాణీకుల భద్రత కోసం రైల్వేశాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. ఇవాళ, రేపు నడిచే 107 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇప్పటి వరకు ఈరోజు నడిచే 70 రైళ్లు రద్దయ్యాయి. బుధవారం నడిచే 36 రైళ్లు, ఈ నెల 30న నడిచే 1 రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేశారు. కాగా, రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ తుఫాన్ వేళ కీలక సూచనలు చేసారు.
మొంథా తుపాన్ అలజడి ప్రభావ ప్రాంతాల్లోని ప్రతి రైల్వే విభాగంలో అత్యవసర నియంత్రణ కేంద్రాలు (వార్ రూమ్స్) తక్షణమే ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే వ్యవస్థలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏపీ పరిధిలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజనుల్లో అవసరమైన సామగ్రి, యంత్ర పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోనేలా సిబ్బందిని ఆదేశించాలని సూచించారు. ఈ తుపాన్ ప్రభావం కారణంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రైళ్ల రాకపోకలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ కోస్ట్ రైల్వే , సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో అత్యవసర పరిస్థితులపై వెంటనే స్పందించేందుకు తగిన వనరులు, సిబ్బందితోపాటు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణ, ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులు అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి రైళ్ల రాకపోకల వివరాలను రైల్వే సిబ్బంది వివరిస్తున్నారు. హెల్ప్ డెస్క్ నెంబర్లకు ఫోన్ చేసిన వారికి రైల్వే సిబ్బంది రైళ్ల సమాచారం అందిస్తున్నారు. హైదరాదాబాద్, చెన్నై, భువనేశ్వర్ నుంచి నడిచే పలు రైళ్లు రద్దు చేశారు. తుపాను ప్రభావం కారణంగా అధికారులు 6 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. 18 రైళ్ల సమయ వేళల్లో మార్పులు చేసి నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications