తిరుమల ప్రాచీన శాసనల డిజిటలైజేషన్: రాయల కాలం నాటి విశేషాలు వెలుగులోకి..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాకార గోడలపై చెక్కిన ప్రాచీన శాసనాల సుదీర్ఘ చరిత్రను భద్రపరచడానికి ఆర్కియాలజీ విభాగం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమల ఆలయ ప్రాకారాల నుంచి గతంలో సేకరించిన దాదాపు వంద శాసన ఎస్టాంపేజ్‌లను డిజిటలైజ్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా ఇది ఆరంభమైంది. శతాబ్దాల నాటి అమూల్యమైన చారిత్రక రికార్డులను కాపాడటం, భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఏఎస్‌ఐ ప్రస్తుతం డిజిటలైజ్ చేస్తున్న ఈ శాసన ముద్రల్లో తిరుమల ఆలయం మొదటి ప్రాకారం ఉత్తర గోడపై లభించిన రెండు శాసనాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ రెండు చారిత్రక ఆధారాలు పూర్తిగా తెలుగు లిపిలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుమలలో విజయనగర సామ్రాజ్య కాలం నాటి ప్రాభవం, నాటి సంస్కృతి, తెలుగు భాషా వికాసాన్ని ప్రత్యక్షంగా నిరూపించే అత్యంత అరుదైన ఆధారాలుగా భావిస్తోన్నారు.. వీటిని.

ఈ రెండు ప్రత్యేక తెలుగు శాసనాలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల దేవేరులైన చిన్నాజి అమ్మ, తిరుమలమ్మ శ్రీవారికి సమర్పించిన విశేష కానుకల వివరాలు ఇందులో ఉన్నాయి. రాత్రి వేళ పూజల అనంతరం శ్రీవారికి పాలను నివేదించడానికి 374 తులాల బరువున్న రెండు అత్యంత విలువైన బంగారు గిన్నెలను ప్రదానం చేశారు. దీని బరువు 374 తులాలు. సుగంధ ద్రవ్యాలు ఉంచడానికి 10 తులాల బరువున్న ఓ బంగారు పళ్లేన్ని రాణులు స్వామివారికి సమర్పించినట్లు ఈ శాసనాల్లో స్పష్టంగా రాసి ఉంది.
ఈ చారిత్రక ఆధారాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు తన పాలనా కాలంలో తిరుమలను మొత్తం ఏడుసార్లు దర్శించుకుని స్వామివారికి అనేక కానుకలు అర్పించారు. ప్రస్తుతం ఏఎస్‌ఐ డిజిటలైజ్ చేస్తోన్న ఈ శాసనాల్లో పేర్కొన్న బంగారు గిన్నెలు, పళ్లెం కానుకలను ఆయన తన మొదటి తిరుమల పర్యటన సమయంలోనే దేవేరులతో కలసి సమర్పించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. దేవరాయల తొలి దర్శనం నుంచే తిరుమల ఆలయానికి కానుకలు సమర్పించారనేది వీటి ద్వారా తెలుస్తోంది.
ఆలయ రాతి గోడలపై ఉన్న శాసనాలపై ప్రత్యేకమైన కాగితం ఉంచి గుజ్జుతో ఒత్తి ముద్రలు తీసే పద్ధతిని ఎస్టాంపేజ్ అని పిలుస్తారు. కాలక్రమేణా వాతావరణ మార్పులు, రాతి క్షీణత వల్ల గోడలపై ఉన్న మూల శాసనాలు అరిగిపోయే ప్రమాదం ఉండటంతో దీని డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏఎస్ఐ. గతంలో సేకరించిన ఈ ముద్రలను ఏఎస్‌ఐ విజయవాడ విభాగం ఆధునిక స్కానర్ల సహాయంతో హై-రిజల్యూషన్ డిజిటల్ రూపంలోకి మార్చుతోంది. ఈ విధానం ద్వారా వందల ఏళ్ల నాటి అక్షరాలు, లిపి శాశ్వతంగా డిజిటల్ రికార్డులుగా భద్రంగా ఉంటాయి.
తిరుమల ఆలయంలో లభించే పురాతన శాసనాల్లో ఎక్కువగా తమిళం, కన్నడ భాషలు కనిపించినప్పటికీ, తెలుగులో లభించిన ఈ చారిత్రక ఆధారాలు నాటి ప్రాంతీయ భాషా వైభవాన్ని, రాజవంశాల భక్తిశ్రద్ధలను ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తోన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత డిజిటల్ కాపీలను ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, భాషా పరిశోధకులు, విద్యార్థులకు తిరుమల చారిత్రక వైభవాన్ని మరింత నిశితంగా అధ్యయనం చేసే అవకాశం లభించినట్టవుతుంది.














Click it and Unblock the Notifications
