అసెంబ్లీ బాయ్‌కాట్: జగన్ పార్టీ అంతర్మథనం
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. అయితే, ఈ విషయంలో పార్టీ శాసనసభ్యుల్లో రెండు అభిప్రాయాలున్నాయి. సభాపతి కోడెల శివప్రసాదరావుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంత వరకూ సమావేశాలకు హాజరు కారాదన్న నిర్ణయం తప్పా ఒప్పా అనే సందిగ్ధంలో పడింది.
వాస్తవానికి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చిన వెంటనే దానిపై చర్చ చేపడతారని, సోమవారం నాటికి సభలో దీనిపై చర్చ జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావించింది. కానీ, 14 రోజుల తర్వాత దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో అధికారపక్షం ఉంది. ఈ ప్రకారంగా బడ్జెట్ సమావేశాలను మొత్తాన్ని వైసీపీ బహిష్కరించాల్సి ఉంటుంది. ఇది రాజకీయంగా మంచిది కాదేమోనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాయ్‌కాట్ చేయడం సబబేనని మరికొందరు భావిస్తున్నారు. కానీ 23వ తేదీ వరకు మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఆ తర్వాత ఎలాగూ సస్పెన్షన్‌కు గురైన 8 మంది సభ్యులు కూడా మళ్లీ అసెంబ్లీకి వచ్చేవారు గనుక వారితో కలసి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఉంటే బాగుండేదంటున్నారు.
23వ తేదీ తర్వాత స్పీకర్ నుంచి గాని, అధికార పక్షం నుంచి రాయబారం రాకుంటే 24 నుంచి మాక్ అసెంబ్లీని నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టులను సందర్శిస్తామని మరికొందరు చెబుతున్నారు. మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కావచ్చునేమో అనే సందేహం మాత్రం వీడడం లేదు.












Click it and Unblock the Notifications