ఫిరాయింపులపై జగన్ మరో వ్యూహం: స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఓడించడంతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది.
సోమవారం రాత్రి గందరగోళం మధ్య చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. అయితే, ఓటింగుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబట్టినా వినిపించుకోలేదు. దీంతో స్పీకర్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురించి మరిన్ని విశేషాలు

అసెంబ్లీ కౌరవసభను తలపిస్తోందని, స్పీకర్‌పై అవిశ్వాసం ప్రతిపాదిస్తామని సోమవారం రాత్రే జగన్ చెప్పారు. స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారని, తమకు సరైన సమయం ఇవ్వడం లేదని వైసిపి శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగితే తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎనిమిది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించవచ్చుననే జగన్ వ్యూహం దెబ్బ తిన్నది.
దాంతో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దాన్ని చర్చకు పెట్టడం ద్వారా ఓటింగు జరిగేలా చూడాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి వైసిపి శాసనసభ్యులు మంగళవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసు అందించారు.












Click it and Unblock the Notifications