19న ఆటో డ్రైవర్ల ఛలో విజయవాడ..! ఉచిత బస్సు వేళ 25 వేల డిమాండ్..!
ఏపీలో ఆటో డ్రైవర్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే గిరాకీలు లేవని ఓవైపు బాధపడుతుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వారి పరిస్ధితి మరింత దీనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలు చోట్ల రోడ్లెక్కుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 19న ఛలో విజయవాడకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు.
హైకోర్టు వద్ద ఇవాళ జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కై సెప్టెంబర్ 19న చలో విజయవాడ చేపట్టాలని నిర్ణయించారు. సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా జనవరి 4న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహా ప్రదర్శన ను జయప్రదం చేయాలని వారు కోరారు. ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరారు. పెంచిన అన్ని రకాల ఫీజులు ,పెనాల్టీలు తగ్గించాలన్నారు.

వాహన ఫిట్నెస్,ఏటిఎస్ ఆటోమేటిక్ ట్రాకులు ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని రద్దు చేయాలని, వాహన ఫిట్నెస్ ను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్ల అందరికీ
వాహన మిత్ర ద్వారా 25 వేల రూపాయలు వెంటనే అందజేయాలని యూనియన్ నేతలు కోరారు. అలాగే ఆటోవాలాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రవాణా రంగంలో ఆటో కార్మికుల ఎదుర్కొంటున్నపై సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 19న చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓలా , ఉబర్, రాపిడో యాప్స్ ను రద్దుచేసి ప్రభుత్వమే యాప్స్ ను నిర్వహించాలని కూడా కోరారు. వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి 25 వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు..












Click it and Unblock the Notifications