మహోజ్వల ఘట్టానికి లక్ష లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.
Recommended Video

ఇప్పటికే అయోధ్యా రాముడు గర్భగుడిలోకి ఏతెంచిన విషయం తెలిసిందే. కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఇది. దీని ఎత్తు 51 అంగుళాలు. నల్లరాతిపై శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారు. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. 70 సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటోన్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు.

ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. శ్రీరామచంద్రులవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం.. లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. దీనికోసం లక్ష లడ్డూలను సిద్దం చేసింది.
ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్- 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. రేపు వాటిన్నింటినీ అయోధ్యకు తరలించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications