నందమూరి బాలకృష్ణ పశ్చాత్తాపం..!!
నందమూరి బాలకృష్ణ పశ్చాత్తాపం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ తో షో సమయంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ పశ్చాత్తాపం వ్యక్తం చేసారు. ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో బాలయ్య కాంట్రవర్సీల్లో చిక్కుకుంటున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని..ఎస్వీ రంగారావు గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే కారణమయ్యాయి. ఆ తరువాత ఎస్వీ రంగారావు మనవళ్లు తమకు నందమూరి కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను వివరించారు. బాలయ్య వ్యాఖ్యల్లో తప్పు లేదని తామంతా ఒక్కటేనని వెల్లడించారు. అక్కినేని పైన చేసిన వ్యాఖ్యలపై నాగ చైతన్య , అఖిల్ స్పందించారు. అక్కినేని అభిమానులు నిరసనలు వ్యక్తం చేసారు. ఆ తరువాత తనకు అక్కినేని నాగేశ్వర రావుతో ఉన్న సంబంధాలను బాలకృష్ణ వివరించారు. ఆ వివాదం కూడా సమిసిసోయింది. ఇక..పవన్ కల్యాణ్ షో లో నర్సుల గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి.
ఆహా వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ లో పవన్ చేసిన తొలి ఎపిసోడ్ విడుదల అయింది. బాలకృష్ణ - పవన్ కల్యాణ్ మధ్య షో లో భాగంగా.. బాలయ్య తాను కాలేజీ రోజుల్లో ఉండగా జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించారు. తాను ప్రమాదంతో పడిపోగా..తనను ఆస్పత్రికి తరలించారని చెబుతూ..కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రిలో నర్సు కనిపించిందని వివరించారు. ఆ సమయంలో ఆ నర్సు...అంటూ ఒక కామెంట్ చేసారు. దీని పైన నర్సుల సంఘాలు స్పందించాయి. బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకొని నర్సులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర నర్సింగ్ సంక్షేమ సంఘం కూడా బాలయ్య తన వ్యాఖ్యల పైన క్షమాపణలు డిమాండ్ చేసింది. దీంతో..ఇప్పుడు బాలకృష్ణ ఈ వివాదం పైన స్పందించారు.

తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బాలయ్య ఈ వివాదం పై వివరణ ఇచ్చారు. అందులో.."అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ...నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ... మీ నందమూరి బాలకృష్ణ..అంటూ పోస్టు చేసారు. దీంతో..ఇక ఈ వివాదం ముగిసింది.












Click it and Unblock the Notifications