'బాలకృష్ణకు చికిత్స అవసరం, మోడీ మాటలు సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు!!'
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధానిపై ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలతో పాటు నెటిజన్లు కూడా ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
అంతేకాదు, చంద్రబాబు తాజా తీరుతో గతంలో ఆయన చేసిన అంశాలు చర్చనీయాశంగా మారాయి. నిర్మాతపై కాల్పులు, సెక్యూరిటీ గార్డ్ మృతి, అభిమానులపై చేయి చేసుకోవడం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తదితర అంశాలను గుర్తు చేస్తున్నారు. బాలకృష్ణ నోటిని పినాయిల్‌తో శుభ్రం చేయాలని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు.

బాలకృష్ణకు మానసిక చికిత్స అవసరం!
బాలకృష్ణ వెర్రివాడిలా మాట్లాడుతున్నాడని, అతను మాట్లాడే భాష దారుణంగా ఉందని, అతనికి ఏమైనా సెన్స్ ఉందా, అతని మానసిక ఆరోగ్యంపై అనుమానం కలుగుతోందని, అతనికి చికిత్స అవసరమేమో అని బీజేపీ నేత సుధీష్ రాంభోట్ల సహా పలువురు నేతలు అన్నారు.

చంద్రబాబు ప్రోత్సాహం ఉన్నట్లుగా కనిపిస్తోంది
మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆయన ఆ విధంగా మాట్లాడారని మాజీ మంత్రి మాణిక్యాల రావు ఆరోపించారు. ప్రధానిని బాలకృష్ణ విమర్శించడం, అక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వడాన్ని బట్టి చూస్తే ఆయన ప్రోత్సాహంతోనే దూషించినట్లుగా తెలుస్తోందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఆరోపణలపై విచారణ జరిపించాలి
బాలకృష్ణ అనేక సార్లు అదుపు తప్పి మాట్లాడారని మాణిక్యాల రావు అన్నారు. ప్రధాని దీక్ష చేస్తే ఏ విధమైన ఖర్చు కాలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షతో పాలన స్తంభించిందని, ప్రజాధనం ఖర్చు చేసి ప్రచార కార్యక్రమంగా మార్చారన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు.

మోడీ మాటలను ప్రధాని సీరియస్‌గా తీసుకున్నట్లుగా ఉంది!!
బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని గతంలో ఓ కేసు విషయంలో లాయర్లు చెప్పారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మరికొందరు సెటైర్లు వేస్తూ.. ఇటీవల మోడీ లండన్‌లో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా తాను తిట్లు, విమర్శల కారణంగా శక్తిమంతుడిగా తయారయ్యానని చెప్పారని, బాలకృష్ణ దానిని సీరియస్‌గా తీసుకొని ఇలా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications