అప్పుడందరూ ఎంజాయ్ చేశారు: ముద్దుపై బాలకృష్ణ ఉద్వేగం, కసిరాడు
హైదరాబాద్: ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో వస్తున్నాయని వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అసెంబ్లీలో స్పందించారు. తాను సినిమా నటుడిగా ఓ సినిమా వేడుకలో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.
తన చిత్రాల్లో మహిళలకు ప్రాధాన్యత, గౌరవం ఇస్తానని చెప్పారు. జనం ఏం కోరుకుంటున్నారో చెప్పేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని అభిప్రాయపడ్డారు. సినిమాల పరంగా మాత్రమే తాను ఆ రోజు మాట్లాడానని చెప్పారు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్, ఆయన నటించిన చిత్రాలు, వాటిలో మహిళలకు దక్కిన ప్రాధాన్యం... తదితరాలను బాలయ్య ప్రస్తావించారు.
తన గురించి తన చిత్రాల్లో నటించే మహిళా నటులకు బాగా తెలుసని కూడా ఆయన తెలిపారు. తన తండ్రి చిత్రాల్లోలాగే తన చిత్రాల్లోనూ మహిళలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలు కూడా తన చిత్రాలను, మహిళల పట్ల తన వైఖరిని గుర్తుంచుకుంటాయని కూడా బాలయ్య పేర్కొన్నారు.
ప్రతిపక్షం.. ఇక్కడున్న (సభలో) వందమందిని కాదని, బయట ఉన్న వారందరినీ తీసుకొని మాట్లాడాలన్నారు. నేను ఓ సినిమా నటుడిగా మాత్రమే స్టేజ్ పైన మాట్లాడానని చెప్పారు. దయచేసి నా వ్యాఖ్యల పైన ఎవరు కూడా పెడార్థాలు తీయవద్దన్నారు.
తాను మాట్లాడుతున్న సందర్భంగా తన ప్రసంగానికి అడ్డు తగిలేందుకు యత్నించిన ఓ విపక్ష ఎమ్మెల్యేను బాలయ్య కసురుకున్నారు. కాగా, బాలకృష్ణ ఇటీవల ముద్దు, గర్భం అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications