జూఎన్టీఆర్ ఇష్టమన్న బాలకృష్ణ: హరి, పురంధేశ్వరిలపై..
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులైన అన్నయ్య నందమూరి హరికృష్ణ, సోదరి పురంధేశ్వరి, హీరో జూనియర్ ఎన్టీఆర్ తదితరుల పైన స్పందించారు. తమ పార్టీలో హరికృష్ణకు సముచిత స్థానం కల్పిస్తామని బాలయ్య చెప్పారు.
హీరో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరఫున ప్రచారానికి రావడం ఆయన ఇష్టమన్నారు. వ్యక్తిగతంగా ప్రచారానికి రావాలని తాము ఎవరిని కూడా ఆహ్వానించలేదని చెప్పారు. తన సోదరి, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నియోజకవర్గంలో ప్రచారం షెడ్యూలులో లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే మాత్రం బిజెపి తరఫున పోటీ చేస్తున్న తన సోదరి పురంధేశ్వరికి ప్రచారం చేసేందుకు సిద్ధమన్నారు.

పార్టీ పైన గౌరవం ఉంటే ఎవరైనా ప్రచారం చేయవచ్చునని జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చెప్పారు. చంద్రబాబు నాయుడు మంచి ఆర్థిక నిపుణులు అన్నారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను తాము నిలబెట్టుకుంటామన్నారు. తమకు పదవులు కొత్త కాదని, ప్రజల కోసం పని చేస్తే అవే వెతుక్కుంటూ వస్తాయన్నారు. తమపై ఆరోపణలు చేసిన వారంతా 420లే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, తమ అభిమానులు ఒక్కటేనని, ఎలాంటి భేషజాలు లేవన్నారు.
కాగా, బాలకృష్ణ రోడ్‌షో, సమావేశాలకు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అపూర్వ ఆదరణ లభించింది. తనదైన పంచ్ డైలాగులతో బాలయ్య ఆకట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను గుర్తు చేస్తూనే ప్రతిపక్షాలపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ప్రతి చోటా బాలకృష్ణ ప్రసంగాలకు జనం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం బాలయ్యను చూసేందుకు పోటీ పడ్డారు.
టిడిపికి ఆస్తులు కూడబెట్టడం తెలియదని, పేదలకు కూడు పెట్టడమే తెలుసన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications