బస్టాండ్‌వద్ద ఊడ్చిన బాలకృష్ణ, బెజవాడలో ఫస్ట్ టైం..
అనంతపురం/విజయవాడ: అనంతపురం జిల్లా లేపాక్షిలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన చీపురు పట్టుకుని లేపాక్షి బస్టాండ్ వద్ద రహదారిని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతో ఉన్నతమైందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

విజయవాడలో టిడిపి విస్తృత సమావేశం
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం తొలిసారిగా హైదరాబాద్ వెలుపల గురువారం విజయవాడ నగరంలో జరగబోతోంది. పార్టీ సాధారణంగా ఇలాంటి సమావేశాలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతి మూడు మాసాలకోసారి జరుగుతుంటాయి. అయితే ఈ దఫా విస్తృత స్థాయి సమాశం పేరిట రాష్ట్ర కార్యవర్గంతో పాటు అనుబంధ సంస్థల బాధ్యులు, జిల్లాల కన్వీనర్లు, అడ్‌హాక్ కమిటీలో ఉన్న పాత కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇలా దాదాపు వెయ్యిమంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.
తొలిసారిగా జరుగుబోతున్న ఈ సమావేశానికి విచ్చేస్తున్న ముఖ్య నేతలందరికీ ఘనస్వాగతం పలుకుతూ నగరమంతటా పెద్దఎత్తున బ్యానర్లు వెలిశాయి. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం సీఎం చంద్రబాబు ఇతర ముఖ్యులు గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని రోడ్డు మార్గాన సమావేశ మందిరం ఎ కాన్ఫరెన్స్ హాల్‌కు రానున్నారు.
సాయంత్రం వరకు ఇక్కడ గడపనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు, ఆ తర్వాత పార్టీని జాతీయ పార్టీగా ఏర్పాటు చేసే విషయంపై విస్తృత స్థాయిలో చర్చ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే బిసి వర్గానికి చెందిన ఎల్ రమణ అధ్యక్షునిగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications