సినిమాలు వదిలేయ, తగ్గించుకుంటా: బాలకృష్ణ
హైదరాబాద్: తాను సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభా స్థానం అభ్యర్థి, నందమూరి హీరో బాలకృష్ణ చెప్పారు. అయితే, ప్రజా సేవ కోసం సినిమాలను తగ్గించుకుంటానని ఆయన గురువారంనాడు మీడియాతో చెప్పారు. తక్కువ సినిమాలు చేస్తూ హిందూపురాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా స్థానం నుంచి పోటీ చేసిన బాలయ్య ఇప్పటికే అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. హిందూపురం నుంచి విజయం సాధిస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీలో తన పాత్ర అధ్యక్షుడి సూచనల మేరకే ఉంటుందని బాలకృష్ణ బుధవారం హిందుపురంలో అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో తాను మంచి మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓటింగు శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని ఆయన అన్నారు. అభివృద్ధికి ఓటేయాలని తాను ప్రచారం చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. ప్రణాళిక ప్రకారం హిందూపురం సమస్యలను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. హిందూపురం ప్రజలంతా ఓ కుటుంబం వంటివారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications