బాలయ్య రోల్: ఈజీగా తీసుకున్న చంద్రబాబు
హైదరాబాద్: పార్టీలో లేదా ప్రభుత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నిర్వహించాల్సిన పాత్రపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన చెందడం లేదని అర్థమవుతోంది. పైగా, తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్య ఈ విషయాన్ని తెలియజేస్తోంది. బాలయ్య పాత్రపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు - చూద్దాం, 106 మంది ఎమ్మెల్యేలున్నారని సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీడియా సమావేశం నుంచి చంద్రబాబు లేచిపోయారు. దీన్నిబట్టి బాలకృష్ణకు చంద్రబాబు మంత్రివర్గంలో బాలయ్యకు మంత్రి పదవైనా దక్కుతుందా, లేదా అనేది అర్థం కాకుండా పోయింది. బాలకృష్ణ పట్టుబట్టి అనంతపురం జిల్లాలోని హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా వినకుండా అసెంబ్లీకి బాలయ్య పోటీ చేశారని అంటారు. ఇందులో బాలయ్య వ్యూహమేమైనా ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అభిమానులు మాత్రం బాలకృష్ణను కాబోయే సిఎంగానే చూస్తున్నారు. బాలయ్య కార్యక్రమాల్లో అటువంటి నినాదాలు చేయడం ఆనవాయితీగా మారింది.
గతంలో చంద్రబాబు మరో బావమరిది నందమూరి హరికృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిని ఇచ్చారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఆయనను ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు. మంత్రి పదవి తీసుకుంటే బాలయ్య సినిమాలు చేయడానికి వీలు కాదు.
ప్రస్తుతానికి బాలయ్య చేతిలో సినిమాలేవీ లేవు. గాడ్సే అనే పేరుతో వచ్చే సినిమాలో నటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జూన్ 10వ తేదీ నుంచి దాని షూటింగ్ ప్రారంభం కావచ్చునని అంటున్నారు. సినిమాల్లో నటించాలని బాలయ్య అనుకుంటే మంత్రి పదవి చేపట్టడం కూడా కష్టమే అవుతుంది. బాలయ్య మాత్రం బావ చంద్రబాబు ముఖ్యమంత్రి అనే విషయానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications