CASINO ROW:కేసినో - పేకాట: చీకోటితో సంబంధాలపై బాలినేని క్లారిటీ..!!
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసినో - చీకోటి ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవీణ్ తో ఉన్న సంబంధాల పైన అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రవీణ్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ.. విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏపీ - తెలంగాణలో ప్రతిపక్షాలు అధికార పార్టీల నేతల పైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇక, ఏపికి సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ వ్యవహారం పైన స్పందించారు.
కేసినోకు అప్పడప్పుడు వెళ్తుంటానని చెప్పుకొచ్చారు. పేకాట ఆడుతానని చెప్పారు. అంతే కానీ, తనకు చీకోటి ప్రవీణ్ కుమార్‌తో, హవాలాతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని బాలినేని తేల్చి చెప్పారు. ఈడీ విచారిస్తున్న కేసినో నిర్వాహకుడితో సంబంధాలున్నాయంటూ చేస్తున్న ప్రచారం పైన బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. సంబంధం లేని విషయాల్లోకి లాగి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని.. ఇలాంటి డ్రామాలు వద్దంటూ హెచ్చరించారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.

ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణలోనూ చీకోటితో ఉన్న రాజకీయ సంబంధాల పైన ఆరా తీస్తున్నారు. చీకోటి ల్యాప్ టాప్ సీజ్ చేసిన ఈడీ అధికారులు బ్యాంకు లావాదేవీల గురించి అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ విచారణ సమయంలో మరింత సమాచారం చీకోటి..మాధవ రెడ్డి నుంచి సేకరించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications