టీడీపీ నేతల వద్దే 15 కోట్లు అప్పు చేసాను, 2024లో జరిగేదిదే - బాలినేని..!!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వెయ్యి కోట్లు సంపాయించానని ఆరోపిస్తున్న వారికి సమాధానంగానే తాను వ్యాఖ్యలు చేసానని వివరించారు. అదే సమయంలో తన అప్పుల గురించి చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీ పని చేసిందని పేర్కొన్నారు. ఏపీలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ప్రజలు వైసీపీతోనే ఉన్నారని స్పష్టం చేసారు. టీడీపీ నేతలే తనకు అప్పులు ఇచ్చారని చెప్పారు.
కీలక వ్యాఖ్యలు : తెలంగాణ ఎన్నికల్లో పందెం గురించి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా బాలినేని కీలక కామెంట్స్ చేసారు. తాను రాజకీయం కోసం తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు పోగొట్టుకున్నానని చెప్పారు. తన వద్దకు ఎవరన్నా వచ్చి సాయం అడిగితే అప్పు చేసైనా వారికి సాయం చేస్తానని చెప్పారు. తాను ఒంగోలులోనే టీడీపీకి మద్దతుగా ఉండే వారి వద్ద రూ 15 కోట్లు అప్పు చేసానని వెల్లడించారు. తాను ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే రకం కాదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన వద్ద డబ్బులు లేకపోతే తన కోసం తన వియ్యంకుడు ఖర్చు చేసారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తన కేడర్ ను అప్రమత్తం చేసేందుకే సహకరిస్తేనే పోటీ చేస్తానని చెప్పానని బాలినేని వివరించారు.

మంచి మెజార్టీతో గెలుస్తా : ఒంగోలులో వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని బాలినేని చెప్పారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేసారు. జగన్ సంక్షేమ పథకాలు పేదలకు అందాయని. వారంతా జగన్ కు మద్దతుగా నిలుస్తారని విశ్లేషించారు. తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిందని చెప్పారు. టీడపీ అక్కడ కాంగ్రెస్ కు...జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చాయన్నారు. ఏపీలో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి పొత్తుతో వెళ్తున్నాయన్నారు. సెటిలర్లు టీడీపీ చెప్పినా కాంగ్రెస్ కు ఓటు వేయలేదని..అదే పరిస్థితి ఏపీలో రిపీట్ అవుతుందని విశ్లేషించారు. వైసీపీ ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పిన బాలినేని..టీడీపీ ఎంత రోడ్ల మీదకు వచ్చినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారని స్పష్టం చేసారు.
ఆస్తులు పోగొట్టుకున్నాను : తెలంగాణలో ఇద్దరు వేర్వేరుగా పోటీ ఎందుకు..ఏపీలో కలిసి ఎందుకో స్పష్టత ఇవ్వాలని బాలినేని డిమాండ్ చేసారు. మంత్రిగా ఉన్న సమయంలో డబ్బులు ఇస్తే తీసుకోవటం పైనా క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ గా ఎవరైనా ఇస్తే తీసుకున్నామని వివరించారు. ఇక..తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పైన బాలినేని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే తన తండ్రి ఇచ్చిన ఆస్తులే పోగొట్టుకున్నామని వెల్లడించారు. తాను వేయి కోట్లు సంపాదిస్తే టీడీపీ నేతల వద్ద 15 కోట్లు ఇప్పటికీ అప్పు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తానే ఒంగోలు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలినేని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications