మీ దగ్గర ATM కార్డు ఉందా? ఉంటే..!
ATM కార్డు కలిగివుండటంద్వారా మనం ప్రమాద బీమాను కలిగివున్నామనే విషయమే చాలామందికి తెలియదు
ప్రతి బ్యాంకు తన ఖాతాదారుడికి ఏటీఎం కార్డులు (డెబిట్) అందజేస్తున్నాయి. బ్యాంకులో ఖాతా ఉంటే నాలుగైదు శాతం మినహా అందరికీ ATM కార్డ్ కూడా దాదాపుగా ఉంటుంది. పెద్దమొత్తంలో అవసరమైన డబ్బును చిన్న ATM కార్డ్ ద్వారా సులభంగా ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నాం. మన జీవనవిధానంతో ఈ కార్డులు అంతగా పెనవేసుకుపోయాయి. అయితే ATM కార్డ్ ఉండటంవల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియదు.

ప్రమాదానికి గురైతే ఆదుకుంటుంది
ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన, రూపే కార్డ్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ATM కార్డ్ ముఖ్యమైన లక్షణాల్లో ఉచిత బీమా ఒకటి. ఒక బ్యాంకు తన ఖాతాదారుడికి ఎప్పుడైతే ATM కార్డ్ మంజూరు చేస్తుందో అప్పటి నుంచి బీమా పరిధిలోకి వస్తాడు. దీనిపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించకపోవడంవల్ల చాలామందికి తెలియదు. చాలా కొద్దిమంది మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ATM కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన సందర్భంలో కూడా ATM కార్డ్ ఆదుకుంటుంది. కుటుంబానికి లేదంటే గాయపడిన వ్యక్తి వైద్య ఖర్చులకు అండగా ఉంటుంది.

ఒక్కసారన్నా ట్రాన్సాక్షన్స్ చేసివుండాలి..
ప్రమాదంలో కాలుకానీ, చేయికానీ కోల్పోతే అతనికి రూ.50వేల బీమా కవరేజీ ఉంటుంది. రెండు చేతులు లేదంటే రెండు కాళ్లు కోల్పోతే రూ.లక్ష బీమా వస్తుంది. ఒకవేళ ATM కార్డ్ కలిగిన వ్యక్తి మరణిస్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్రమాదబీమా ఆ వ్యక్తి కుటుంబానికి లభిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ATM కార్డ్ ద్వారా వచ్చే బీమాను క్లెయిమ్ చేసుకోవడానిక ఒక చిన్న నిబంధనను మాత్రం అధికారులు పెట్టారు. ప్రమాదానికి గురవడానికి 45 రోజుల ముందు ఒక్కసారైనా కార్డుతో ట్రాన్సాక్షన్ చేసివుండాలి. దీనివల్ల క్లెయిమ్ చేసుకోవడం సులువవుతుంది.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు రకరకాలుగా ATM కార్డ్ లను అందజేస్తున్నాయి. కార్డు కేటగిరిని బట్టి బీమా లభిస్తుంది. ATM కార్డ్ క్లాసిక్ పై రూ.లక్ష, ప్లాటినం కార్డుపై 2 లక్షల రూపాయలు, మాస్టర్ కార్డ్ పై రూ.50వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డుపై రూ.5 లక్షలు, వీసా కార్డుపై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ దక్కుతుంది. అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాదారులకు అందిన రూపే కార్డుపై రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ అందుతుంది. ATM కార్డ్ మీద ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి, సంబంధిత బ్యాంకుకు ఆ కార్డు కలిగివున్న వ్యక్తికానీ, కుటుంబ సభ్యులుకానీ దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకులో FIR కాపీ, హాస్పిటల్ లో తీసుకున్న చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఒకవేళ కార్డుదారుడు మరణిస్తే అతని తరఫున నామినీగా ఉన్నవారు సంబంధిత బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువీకరణ పత్రం, FIR కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్ వంటి పత్రాలు అందజేయాలి. మీ సమీపంలోని బ్యాంకును సంప్రదిస్తే కార్డుపై ఉన్న మరిన్ని ప్రయోజనాలు, ఇతర వివరాలు తెలియజేస్తారు.












Click it and Unblock the Notifications