ఆంధ్రా యూనివర్సిటీలో మోడీ BBC డాక్యుమెంటరీ
విశాఖపట్నంలోని ఏయూ క్యాంపస్ లో గుట్టుచప్పుడు కాకుండా మోడీ బీబీసీ డాక్యుమెంటరీని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడంతో విద్యార్థి సంఘాల మధ్య అగ్గి రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లపై బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇది దేశంలో ఎక్కడా ప్రసారం కాకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రగతిశీల సంఘాలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో డాక్యుమెంటరీ ప్రదర్శనను ఏబీవీపీ అడ్డుకుంది. దీంతో ఎటువంటి హడావిడి లేకుండా విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని ఏయూలో ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు ప్రదర్శించడం దారుణం అని తప్పుపట్టింది. చదువుల తల్లి సరస్వతి నిలయంలో సమాజానికి వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంటరీని ప్రదర్శించడం దారుణం అని ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు.

చారిత్రాత్మకమైన యూనివర్సిటీలో ఇలాంటి చర్యలను తాము సమర్ధించమని, దీనిపై ఆందోళన చేస్తామని హెచ్చరించింది. అసాంఘిక కార్యకలాపాలకు కొంతమంది ఆచార్యులు కూడా మద్దతిస్తున్నారని, అలా ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఏయూలో డాక్యుమెంటరీని ప్రదర్శించినదానిపై విచారణ జరిపించాలని, ఎవరు బాధ్యులో తేల్చాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.
ఏయూలో శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఏబీవీపీతోపాటు భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా ఏయూ యాజమాన్యంపై మండిపడుతున్నారు. డాక్యుమెంటరీని నిషేధించడంవల్లే అందరిలో చూడాలన్న ఆతృత పెరిగిందని, నిషేధించకుండా వదిలేస్తే అందరూ చూస్తారని, ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరుచుకుంటారని యూనివర్సిటీలో కొందరు పీహెచ్ డీ స్కాలర్లు అంటున్నారు. ఏయూలో వామపక్ష విద్యార్థి సంఘాలకు బలం ఎక్కువగా ఉండటంవల్లే డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరిగిందంటున్నారు.












Click it and Unblock the Notifications