కాపు X బిసి: చంద్రబాబు ముందు 'అన్నా' 12 డిమాండ్లు (పిక్చర్స్)
చిత్తూరు: కాపులను బీసీల్లో చేర్చి తమకు అన్యాయం చేయరాదంటూ బీసీ సంఘర్షణ సమితి వ్యవస్థాపకుడు అన్నా రామచంద్రయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం సాయంత్రం చిత్తూరు పోలీసులు భగ్నం చేశారు.
రామచంద్రయ్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులు, వైద్యులు ప్రయత్నించారు. తనను ఇబ్బందిపెడితే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంటానని గదిలోకి వెళ్లి దీక్ష చేపట్టారు. శనివారం కూడా ఆయన గదిలోనే పెట్రోల్ బాటిల్ పెట్టుకుని దీక్ష కొనసాగించారు.
స్పెషల్ బ్రాంచి పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు వెళ్లి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో శిబిరం వద్ద ఉన్న బీసీ నాయకులు పోలీసులను అడ్డుకుని పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు అనే వ్యక్తి పక్కనే ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కి దీక్షను అడ్డుకుంటే పైనుంచి దూకేస్తానని చెప్పారు.

అన్నా దీక్ష
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టిడిపి ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ రామచంద్రయ్యను కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు వ్యతిరేకం కాదని, కాపులను బీసీల్లో చేర్చడం ద్వారా బీసీలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

అన్నా దీక్ష
దీక్ష విరమిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడించే బాధ్యత తమదని టిడిపి నేతలు అన్నారు. అందుకు ఆయన ససేమిరా అన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ కూడా ఫోన్లో అతనితో మాట్లాడారు. సీఎంతో మాట్లాడిస్తానని, అప్పటిదాకా దీక్ష విరమించాలని కోరారు.

అన్నా దీక్ష
స్పందించిన రామచంద్రయ్య 12 డిమాండ్లతో రూపొందించిన నివేదికను తమ నాయకులతో పంపుతానని, ఐదుమందిని ఇందుకోసం ఎంపిక చేశానని సీఎంతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని, అప్పటి వరకు తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

అన్నా దీక్ష
సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు బలగాలతో, అగ్నిమాపక దళం దీక్షా శిబిరంలోకి ప్రవేశించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా శిబిరంలో ఉన్న వారిపై, దీక్ష చేస్తున్న రామచంద్రయ్యపై అగ్నిమాపక వాహనం సహాయంతో నీళ్లు చల్లారు.

అన్నా దీక్ష
ఈ సమయంలో పోలీసులను అడ్డుకున్న బీసీ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి, వాహనాల్లో తరలించారు. వెంటనే కొంతమంది పోలీసులు రామచంద్రయ్య దీక్ష చేస్తున్న గది తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి, ఆయనను అదుపులోకి తీసుకుని దీక్ష భగ్నం చేశారు. అనంతరం పోలీసు వాహనంలో ఆరోగ్య పరీక్షల నిమిత్తం రుయ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications