సీట్లు కాదు, సిఎం పదవే: కృష్ణయ్య భాష్యం, కవితపై ఫైర్
హైదరాబాద్: టికెట్లు ఎంత మంది బిసీలకు ఇచ్చామనేది ప్రధానం కాదని, బిసి నేత ముఖ్యమంత్రి అయితేనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ప్రచార కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలుగుదేశం పొత్తుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ప్రధానమంత్రిగా బీసీలే ఎన్నికవుతారని, వెనుకబడిన కులాల వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే దద్దమ్మలని అవహేళన చేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆయన అన్నారు.
గురువారం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం కృష్ణయ్య ఎల్ రమణతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నామినేషన్ల ఘట్టం ముగిసే నాటికే టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని చూసి పార్టీ విజయం ఖాయమని ఓటర్లు సైతం నిర్ణయించుకున్నారని రమణ అన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు, విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బిజెపితో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాల్లో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడ్డారని, కొన్నిచోట్ల తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగారని చెప్పారు. వారిని బుజ్జగించేందుకు మండవ వెంకటేశ్వరరావు, ఆర్.సీతారామారావు, బి.వెంకటేశ్వర్లుతో కూడిన సమన్వయ కమిటీ పనిచేస్తోందని, అధికారంలోకి వచ్చాక అసంతృప్తులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.
తెలంగాణ కోసం బొంతపురుగును ముద్దు పెట్టుకుంటానని, కుష్టు రోగిని కౌగిలించుకుంటానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఎన్నికల కోసం బడా సంపన్నులను కౌగిలించుకుంటున్నారని ఆరోపించారు. బిజెపికి ఓటేస్తే బాబుకు వేసినట్టేనని కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలను రమణ, కృష్ణయ్య ఖండించారు.
నామినేషన్ దాఖలు చేయడానికి వెళుతున్న సందర్భంలో తనపై తెలుగుదేశం పార్టీ అసంతృప్తుల ముసుగులో జరిగిన దాడిని బిసిలపై జరిగినట్టుగా పరిగణిస్తున్నానని ఆర్.కృష్ణయ్య అన్నారు. కుట్రతో ఇతర పార్టీలకు చెందిన నాయకులే దాడి చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications