రిజర్వేషన్: తిరుపతిలో కాపు, బీసీల మధ్య చిచ్చు
తిరుపతి: జస్టిస్ మంజునాథ్ కమిషన్ తిరుపతి వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. రాష్ట్రంలోని 11 కులాలు, ఆ కులాల పరిధిలోని ఉపకులాలను వెనుకబడిన వర్గాలు (బీసీ) జాబితాలో చేర్చడం కోసం అధ్యయనం చేస్తున్నారు.
అదేవిధంగా బీసీల జాబితాలోని మూడు కులాల గ్రాప్ మార్పిడి కోసం అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. తిరుపతి నగరపాలిక కార్యాలయంలో జస్టిస్ మంజునాథ్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
జస్టిస్ మంజునాథ్ తో పాటు సభ్యులు ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణ, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, కృష్ణమోహన్ (సభ్య కార్యదర్శి)ల బృందం ప్రజాభిప్రాయసేకరణ మొదలు పెట్టంది.
బలిజ, కాపు, తెలగ, ఒంటరి, జెట్టి, కర్ణం, కరుణీగర్, పిళ్లై, కానప్ప, పనాస, వనైయ, గాజుల బలి, కంతిమల్లారెడ్డి కులాల ప్రతినిధులు కమిషన్ ముందు హాజరైనారు. జస్టిస్ మంజునాథ్ కమిటి ఆ కులాల ప్రతినిధుల నుంచి సామాజిక, విద్యాపరమైన అంశాలు అడిగి తెలుసుకున్నారు.
అదే విదంగా బీసీలోని దూదేకుల, పింజారి, లాఢాప్, గాండ్ల, నూర్ బాష, దేవతి కుల, తెలికుల కులాల గ్రూప్ మార్పిడి విషయంపై ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదే సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నాయకులు హాజరైనారు.

రిజర్వేషన్ల చిచ్చు పెట్టారు
ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చరాదని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆందోళనచేపట్టారు. ఇదే సమయంలో బలిజ ఐకాస ర్యాలీగా నగర పాలిక కార్యాలయం చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కాపు ఐకాస నాయకులు నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బలిజ సంఘాలు, బీసీల మద్య తోపులాట జరిగింది. బాహాబాహి జరుగుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఇరు వర్గాల నాయకులను అరెస్టు చెయ్యకుండా కేవలం బలిజ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాపులను బీసీ జావితాలో చేర్చడం వలన రాజ్యాంగబద్దంగా ఉన్న రిజర్వేషన్ విధానంలో పెనుమార్పులు వస్తాయని బీసీ సంఘాల నేతలు చెప్పారు.
అధికారంలో ఉన్న టీడీపీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఇవ్వాలి, అంతే కాని ఇలా బీసీ సంఘాలను రెచ్చగొట్టిస్తున్నారని కాపు సంఘాల నాయకులు ఆరోపించారు. తిరుపతి మాజీ శాసన సభ్యుడు, బలిజ సంఘం నాయకుడు పీసీ. మోహన్ ఈ సమావేశానికి హాజరై తన అభిప్రాయాన్ని జస్టిస్ మంజునాథ్ కమిషన్ ముందు చెప్పారు.












Click it and Unblock the Notifications