శతాబ్దాల నాటి కళ్యాణి బావికి పూర్వవైభవం! నటుడు మాధవన్‌నే ఫిదా చేసిన ఏపీ కుర్రాడు
సోషల్ మీడియాను కేవలం లైకులు, కామెంట్లకే పరిమితం చేయకుండా సమాజంలో మార్పు కోసం వాడుతున్న యువత కథలివి! ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బిట్టు తబాహీ (సురేంద్ర సింగ్ చౌదరి) అజ్నార్ నదిని ఒక్కడే శుభ్రం చేసి రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యాడు. ఎంతలా అంటే.. ఏకంగా డచ్‌కు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 'ది ఓషన్ క్లీనప్' ఆయనకు ఉద్యోగ ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే, ఈ బిట్టు తబాహీ సంచలనం కంటే ముందే... మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక తెలుగు కుర్రాడు అలాంటి మహత్తర ఉద్యమానికే శ్రీకారం చుట్టాడు. ప్రముఖ సినీ నటుడు ఆర్. మాధవన్‌తో కూడా ప్రశంసలు అందుకున్న ఆ యోధుడి ఐడీ పేరు ' తెలుగు అబ్బాయి కాంత్'.
చెత్తకుప్పగా మారిన 500 ఏళ్ల నాటి చారిత్రక బావి
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని అవుకు మండలం కాశీపురం గ్రామంలో ఉన్న 500 ఏళ్ల నాటి పురాతన ఆలయ కళ్యాణి బావి పరిస్థితిని చూసి అబ్బాయి కాంత్ తీవ్రంగా చలించిపోయాడు. శతాబ్దాల నాటి గొప్ప శిల్పకళా వైభవం ఉన్న ఆ బావి.. జనుల నిర్లక్ష్యం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు, కొబ్బరి చిప్పలు, పూలదండలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలా మారింది. మన చారిత్రక వారసత్వ సంపద ఎలా నాశనమవుతుందో కళ్లకు కడుతూ అబ్బాయి కాంత్ ఆ బావి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఒక్క పోస్ట్‌తో కదిలిన 300 మంది యువత!
ఆ పోస్ట్ నెట్టింట వైరల్ కాగానే నెటిజన్ల మనస్సాక్షిని తట్టిలేపింది. ఎలాంటి హడావుడి ప్రకటనలు, ప్రచారాలు లేకుండానే... కేవలం ఆ దృశ్యాలు చూసి చలించిన 300 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఒక్కటయ్యారు. వారసత్వ సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే 'పూర్వ సంపద రక్షక సేన'తో పాటు స్థానిక విద్యార్థులు, సాధారణ ప్రజలు చేతులకు గ్లౌజులు తొడిగి, చేతిలో సంచులు పట్టుకుని రంగంలోకి దిగారు. ఏళ్ల తరబడి బావిలో పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్తను శ్రమదానంతో బయటకు తీసి, ఆ బావికి పూర్వ వైభవాన్ని తెచ్చారు.
సినీ నటుడు మాధవన్ ఫిదా!
తెలుగు కుర్రాడు అబ్బాయి కాంత్ నాయకత్వంలో జరిగిన ఈ చారిత్రక బావి ప్రక్షాళన సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన ప్రముఖ సినీ నటుడు ఆర్. మాధవన్ కూడా ఫిదా అయిపోయి, అబ్బాయి కాంత్ బృందాన్ని బహిరంగంగా ప్రశంసించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సరైన పద్ధతిలో వాడుకుంటే సమాజంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తేచ్చో అనడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
పరిశుభ్రతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు
బావిని శుభ్రం చేయడమే కాకుండా.. అది మళ్లీ చెత్తకుప్పగా మారకుండా ఉండేందుకు అబ్బాయి కాంత్ బృందం పక్కా ప్లాన్ అమలు చేసింది. స్థానిక ప్రజలకు, ఆలయానికి వచ్చే భక్తులకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. చారిత్రక ప్రదేశాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తె తెలిపే హెచ్చరిక బోర్డులను బావి చుట్టూ ఏర్పాటు చేశారు. ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా మన పురాతన సంపదను మనమే కాపాడుకోవచ్చని నిరూపించిన ఈ ఏపీ యువకుడి ప్రయత్నం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications
