విజయ సాయికి రాజ్యసభ వెనుక..: జగన్ షాకింగ్ కారణాలు!
హైదరాబాద్/విజయవాడ: విజయ సాయి రెడ్డిని రాజ్యసభ పంపించాలనుకోవడం ద్వారా వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తన ఆస్తుల కేసులో ఎలాంటి చిక్కులు లేకుండా చూసుకుంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
వైయస్ జగన్ పార్టీలో పదవులు కట్టబెట్టడంలో వ్యూహం పాటిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టడం వల్ల వారు టిడిపిలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. పీఏసీ చైర్మన్ పదవిని ఆశించిన జ్యోతుల నెహ్రూ.. అది రాకపోవడంతో టిడిపిలో చేరారనే వాదనలు ఉన్నాయి.
అదే విధంగా రాజ్యసభ స్థానాన్ని కూడా పలువురు సీనియర్లు ఆశించారని, కానీ విజయ సాయి రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపడం వెనుక పలు కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రధానంగా ఆస్తుల కేసు కారణం కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

విజయ సాయిని రాజ్యసభకు పంపించడం వెనుక కారణాలను జగన్ చెప్పారు. ఆయన చెప్పిన కారణాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయని, టిడిపికి ఆయుధంగా మారాయని అంటున్నారు.
జగన్ తన ఆస్తుల కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో విజయ సాయి కూడా నిందితుడు అని, అతనిని అప్రూవర్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయినా విజయ సాయి తనకు అండగా నిలబడ్డారని జగన్ చెప్పారని అంటున్నారు. పార్టీ కోసం కాకుండా కేసు గురించి జగన్ మాట్లాడటం చర్చనీయాంశమైందని అంటున్నారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా అభధ్రతా భావాన్ని బయటపెట్టుకున్నారని అంటున్నారు.
జగన్ ఆస్తుల కేసులో జగన్ తర్వాత విజయ సాయి రెడ్డి ప్రతి ఛార్జీషీటులో నిందితుడిగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన వ్యక్తిగా ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఓ దశలో ఆయనను అప్రూవర్‌గా మార్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని అంటారు.
విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారితే.. జగన్ ఈ కేసులో పీకల్లోతు మునిగిపోతారని కూడా చాలామంది భావించారు. కానీ విజయ సాయి మొదటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. కేసు విచారణలో కొద్దికొద్దిగా చిక్కుముడి వీడుతోంది. కేసు పరిస్థితి చూస్తుంటే జగన్ బయటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఇప్పుడు కేసు గురించి మాట్లాడటం చూస్తుంటే.. విజయ సాయికి భయంతోనే టిక్కెట్ ఇచ్చారనే వాదనను తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చినా తేవచ్చునని అంటున్నారు. టిడిపికి జగనే ప్రశ్నించే ఆస్కారం కల్పించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications