భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా పవన్?
తనపై వస్తున్న నిందారోపణలు డ్యామేజ్ చేయాలనే లక్ష్యంతో చేస్తున్నవా? కాదా? అనే విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
మౌనం అన్నివేళలా మంచిది కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడుతుండాలి. కీలకమైన సమయంలో కూడా నోరు తెరవకపోతే మన మౌనాన్ని అర్థాంగీకారం అనుకుంటారు. అదే రాజకీయాల్లో అయితే పూర్తి అంగీకారంగా పరిగణిస్తారు. ఇదంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలియనిదేమీకాదు.. అయినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది.

పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్
తనపై వస్తున్న నిందారోపణలు డ్యామేజ్ చేయాలనే లక్ష్యంతో చేస్తున్నవా? కాదా? అనే విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ పై పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని విశ్వసించారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.

తెలంగాణలో కూడా డ్యామేజ్ చేయాలని..
పవన్ చెబుతున్న మాటలను పరిశీలిస్తే తెలంగాణ రాజకీయాల్లోను పవన్ కల్యాణ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 30 నియోజకవర్గాల్లో జనసేన తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని, దానికి ప్యాకేజీ కూడా సిద్ధమైపోయిందని, దాదాపు వెయ్యి కోట్లరూపాయల వరకు ఆయనకు ముట్టచెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికైనా పవన్ నోరు విప్పాలి
రాజకీయాల్లో నాయకులను కొనుగోలు చేయడం సహజంగా జరుగుతుండే ప్రక్రియ. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీలనే కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే పరిణామాలు ఇంకెంత దారుణంగా మారతాయోననే సందేహం ప్రజల్ని పీడిస్తోంది. మార్పు తీసుకురావడానికే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, అవసరమైతే 25 సంవత్సరాలపాటు రాజకీయం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పవన్ ప్రకటించారు. అయితే ఇటువంటి వార్తలు ప్రచారంలోకి రావడంద్వారా బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనుకునేవారికి గొడ్డలి పెట్టుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు మౌనం మంచిదే అయినప్పటికీ ఇటువంటి సందర్భాల్లో కూడా మౌనం ఉండటం మంచిదికాదని, నోరు విప్పాలని జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications