ఈ రైల్లో ప్రయాణం ఫ్రీ... టికెట్ అవసరం లేదు!
మనదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా భారీగా విధిస్తారు. అయితే అక్కడ రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రైలు ఎక్కి శివాలిక్ కొండల అందాలను చూడొచ్చు. తనిఖీ చేయడానికి కూడా ఎవరూ రారు. స్టేషన్ లో దిగిన తర్వాత కూడా ఎవరూ టికెట్ గురించి అడగరు. ఇంతకీ ఆ రైలు పేరు ఏంటంటే.. భాక్రా నంగల్ ట్రైన్.
పంజాబ్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని భాక్రా - నంగల్ మధ్య ఇది నడుస్తుంది. 75 సంవత్సరాల నుంచి ప్రజలు ఈ రైలు ఎక్కుతున్నారు. దాదాపు 13 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఈ రైలుకు సంబంధించిన యజమాని భారతీయ రైల్వే కాదు. భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డ్. భాక్రానంగల్ డ్యామ్ కు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల రవాణా కోసం దీన్ని వాడతారు. సాధారణ ప్రజలు కూడా ఉచితంగా ఎక్కొచ్చు.

అనేక బాలీవుడ్ సినిమాల్లో కూడా దీన్ని చిత్రీకరించారు. నంగల్ నుంచి సాల్వ మీదగా భాక్రా డ్యామ్ కు వెళుతుంది. మార్గమధ్యంలో సట్లెజ్ నదిని దాటుతుంది. దేశంలోని నలుమూలల నుంచి ఇందులో ప్రయాణించేందుకు, ఇక్కడి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తుంటారు. 1948లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో రోడ్డుమార్గం లేకపోవడంతో రైల్వే లైన్ వేశారు. దీన్ని పాకిస్తాన్ లోని కరాచీలో తయారు చేశారు. ప్రారంభంలో ఆవిరి ఇంజన్ తో నడవగా 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఇంజన్ వాడేవారు. నేటికీ దాన్నే వాడుతున్నారు. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది.












Click it and Unblock the Notifications