చంద్రబాబు బయోపిక్ - ప్రముఖ దర్శకుడు ప్రకటన, ప్రధాన పాత్రల్లో..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ సిద్దం అవుతోంది. చంద్రబాబు జీవితంలోని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు దర్శకుడు భానుశంకర్ ప్రకటన చేసారు. 'రాజధాని ఫైల్స్' చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న భాను ప్రకాశ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యారు. కాగా, చంద్రబాబు సహా.. బయోపిక్ లో ఇతరుల పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ వెండి తెర పైకి రానుంది. ఈ మేరకు రాజధాని ఫైల్స్ దర్శకుడు భాను శంకర్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు భాను వెల్లడించారు. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచం మెప్పుపొంది, దార్శనికుడిగా ఎదిగిన చంద్రబాబు ఎదిగిన ప్రయాణం దేశంలోని ప్రతీ పౌరుడికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలోని ప్రతి అడుగూ ప్రజాక్షేమం కోసమేనని, ఆయన ప్రతీ ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమేనని వివరించారు. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతీ ఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్ గా ఉంటుందని భాను శంకర్ వివరించారు.

చంద్రబాబు జీవితంలోని ప్రధాన అంశాల ఆధారంగా
ఈ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపించనున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం, క్రమంగా రాజకీయాల్లో ఎదుగుతూ రాష్ట్ర నాయకుడిగా మారిన తీరు ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజల కోసం చేసిన పనులు..అంశాలను సులభంగా అర్థమయ్యేలా చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
కాగా.. ఇందులో ముఖ్యమంత్రిగా సాధించిన మైలు రాళ్లు.. ప్రతిపక్ష నేతగా చేసిన యాత్రలు.. నందమూరి కుటుంబంతో బంధం, అలిపిరి లో జరిగిన దాడి తో పాటుగా జగన్ హయాంలో జరిగిన అరెస్ట్.. ఆ తరువాత పవన్ తో కలిసి అధికారం లోకి వచ్చే వరకు ఈ బయోపిక్ లో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, చంద్రబాబు పాత్రతో సహా.. ఇతర నేతలు... ముఖ్యుల పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పొలిటికల్ - సినీ సర్కిల్స్ లో ఆసక్తిని పెంచుతోంది. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు, ఇతర సమాచారం త్వరలోనే దర్శకుడు భాను తెలియజేయనున్నారు.












Click it and Unblock the Notifications