ఏపీలో బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే కేసీఆర్ బంపర్ ఆఫర్..!!
అమరావతి: ఊహించినట్టే- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆయన నెలకొల్పిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను విస్తరించడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తోన్నారు. ఇప్పటికే దేశ రాజధాని కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను మొదలు పెట్టారు కూడా. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యాలయాన్నీ మొన్నీ మధ్యేే ప్రారంభించారు.

క్రేజ్ ను సొమ్ము..
తోటి తెలుగు రాష్ట్రం ఏపీలో- కేసీఆర్ కు మంచి క్రేజ్ ఉంది. దీన్ని సొమ్ము చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోన్నారాయన. ఇప్పటికే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో పలు చోట్ల భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. బీఆర్ఎస్ కు ఘన స్వాగతం పలికారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ బాసుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

మలి అడుగు ఏపీలోనే..
దీనితో కేసీఆర్ తన మలి అడుగును ఏపీలో వేయబోతోండటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లల్లో చురుగ్గా ఉంటోన్నారాయన. ఏపీలో పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయబోతోన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఖరారు చేశారని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.

మార్పులు చేర్పులు..
ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణకు సంబంధించిన పనులను ప్రస్తుతం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయానికి, వాస్తుకు అనుగుణంగా ఈ భవనంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని, దీని తరువాత కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకలాపాలు మొదలవుతాయని అంటోన్నారు. జనవరిలో సంక్రాంతి పండగ తరువాత సంప్రదాయబద్ధంగా పూజా పునస్కారాలను నిర్వహించిన కేసీఆర్ స్వయంగా దీన్ని ప్రారంభిస్తారని సమాచారం.

సభ్యత్వ నమోదుపై..
ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా పార్టీ నాయకులు వేగవంతం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 9491015222 అనే మొబైల్ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని పొందే వెసలుబాటును కల్పించింది అగ్ర నాయకత్వం. ఏపీలో బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సౌకర్యం తెలంగాణలో ఉంది.












Click it and Unblock the Notifications