ప్రధాని - సీఎం జగన్ - చిరంజీవి : వేదిక పంచుకొనేది వీరే - రఘురామ కు దక్కేనా..!!
ప్రధాని మోదీ ఏపీ పర్యటన పైన ఆసక్తి పెరుగుతోంది. ప్రధాని షెడ్యూల్ పీఎంఓ నుంచి అధికారికంగా రాష్ట్రానికి అందింది. అయితే, ఆయనతో పాటుగా భీమవరంలో వేదిక ఎవరు పంచుకుంటారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. దీని పైన అధికారిక వర్గాల నుంచి స్పష్టత వస్తోంది. ప్రధాని రేపు (సోమవారం) ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు. గవర్నర్ తో పాటుగా సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని కార్యక్రమం జరిగే భీమవరం వెళ్తారు. ప్రధానితో పాటుగా సీఎం జగన్ సైతం ప్రధానితో పాటుగా ఒకే హెలికాప్టర్ లో ఉంటారు. గన్నవరం లో ఏపీ బీజేపీ నేతలు సైతం ప్రధానికి స్వాగతం పలుకుతారు.

ప్రధానితో పాటుగా సీఎం జగన్
హెలికాప్టర్ లో భీమవరంలో మంత్రులు ..అధికారులతో పాటుగా అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ ప్రతినిధులు ప్రధాని మోదీకి స్వాగతం పలికి..సభకు వద్దకు తీసుకెళ్తారు. అక్కడ 30 అడుగుల అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సైతం ఉన్నారు. దాదాపు లక్ష మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదిక పైన ఎవరెవరు ప్రధానితో పాటుగా ఆశీనులవుతారనే అంశం పైన అధికారిక వర్గాల నుంచి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. గవర్నర్ బిశ్వభూషణ్.. సీఎం జగన్ ఉంటారు.

వేదిక పైన చిరంజీవికి ఛాన్స్
వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. చిరంజీవి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. పురంధేశ్వరి.. అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ తో పాటుగా వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు ఉండనున్నట్లుగా సమాచారం. అయితే, స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి రఘురామ రాజు సైతం హాజరు కావాలని నిర్ణయించారు. ఆయన కోర్టుకు వెళ్లి స్థానిక ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ, అందుతున్న సమాచారం మేరకు ప్రధానితో వేదిక పంచుకొనే వారిలో రఘురామ రాజు పేరు లేదని స్థానిక అధికారుల సమాచారం.

రఘురామకు అవకాశం దక్కేనా
ఈ జాబితాలో అదనంగా చేర్పులకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మంత్రులు సైతం బహిరంగ సభకు హాజరు కానున్నారు. అయితే.. జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు హాజరు కానున్నారు. జనసేన నుంచి ఎవరు హాజరు అవుతారనేది తెలియాల్సి ఉంది. దీంతో..ప్రధాని పర్యటన సమయంలో.. వేదిక మీద ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications