తన నిర్ణయం ఏమిటో నారా లోకేష్‌కు తేల్చి చెప్పిన భూమా అఖిల ప్రియ..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- పాదయాత్రకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. దీనికోసం ఆయన సన్నద్ధమౌతోన్నారు.

ఏడాదికి పైగా..
ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ చెబుతోంది. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర చేయబోతోన్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఈ పాదయాత్ర ద్వారా జనం మధ్యే ఉండనున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య వైద్యం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారాయన.

యువనేతల భేటీ..
ఈ నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకులు నారా లోకేష్‌ను కలుసుకున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, శ్రీకాకుళం జిల్లా లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి సిటీ శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవాని, ఇతర యువ నాయకులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. పాదయాత్రకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

పాదయాత్రలో..
ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయాన్ని ప్రకటించారు. పాదయాత్రలో తాము పాల్గొంటామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులందరూ దశలవారీగా నారా లోకేష్ వెంట సాగుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ధ్వజమెత్తారు. నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడతామనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

అన్ని ప్రాంతాల నుంచీ..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన యువ నేతలందరూ ఒక్కో జిల్లా వారీగా నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించుకుంటామని వారు పేర్కొన్నారు. యువ సత్తాను చాటిచెబుతామని ఇతర నాయకులు వ్యాఖ్యానించారు. పార్టీలో పాత, కొత్త మిశ్రమంతో 2024 నాటి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటామని అన్నారు. యువతరాన్ని కదిలించేలా, పార్టీ వైపు మొగ్గు చూపేలా చరిత్రలో నిలిచిపోయేలా నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని చెప్పారు.

వైసీపీ ఎదురుదాడి..
నారా లోకేష్ తలపెట్టిన ఈ పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారు. దీనిపై విమర్శలను గుప్పిస్తోన్నారు. పాదయాత్రలో ప్రస్తావించడానికి నారా లోకేష్‌కు ఎలాంటి అంశాలు లేవని గుర్తు చేస్తోన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పగలరా? అంటూ సవాల్ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications