పోలీసులు చూస్తుండగానే అడ్డుకుంటోన్నారంటే.. !!
స్థానిక సంస్థల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు అడ్డుకుంటోండటం పట్ల వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి తలెత్తడం పట్ల మండిపడుతోంది.
తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా తెలుగుదేశం కూటమి నాయకులు అడ్డుకుంటోన్నారని, మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని అవమానకరంగా వ్యవహరిస్తోన్నారని వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం, అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ హెచ్చరించడం వంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు.

వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అడ్డుకుంటోన్నారని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగలిగే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో 18 మంది వైసీపీ అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించారని, ఈ ప్రక్రియకు సుమారు 20 మంది పోలీసులు అందుబాటులో ఉండాల్సొచ్చిందని పేర్కొన్నారు.
పోలీసులు ఉన్న చోటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్లను లాక్కుంటున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తేనే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. నందలూరులో బాలసుబ్రమణ్యం తన తుపాకీతో స్వైరవిహారం చేశారని భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, దాన్ని ఎందుకు సరెండర్ చేసుకోలేదని ప్రశ్నించారు.
పోలీసుల బాధ్యత, ఎన్నికల సమయంలో ఆయుధాల నియంత్రణపై స్పష్టత అవసరమని భూమన పేర్కొన్నారు. వైసీపీకి చెందిన నలుగురు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులను టీడీపీ నాయకులు బెదిరిస్తోన్నారని నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులకు భద్రత కల్పించి, బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడం, నామినేషన్ల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించడం అధికార యంత్రాంగం బాధ్యత అని గుర్తు చేశారు.














Click it and Unblock the Notifications
