బాబు ఆంధ్రా ట్రంప్.. ముద్రగడ యాత్రతో సర్కార్‌పై దండయాత్ర: భూమన
విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రతో మరోమారు ప్రభుత్వంపై పోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నట్లుగా వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా చంద్రబాబుపై పలు విమర్శానాస్త్రాలు సంధించిన ఆయన.. ట్రంప్ కు, చంద్రబాబుకు దగ్గర పోలికలున్నాయని కామెంట్ చేశారు. చంద్రబాబును ఆంధ్రా ట్రంప్ అంటూ ఎద్దేవా చేశారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని గత ఎన్నికల్లో హామి ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాపులను మోసం చేశారని విమర్శించారు. కాపుల్లాగే రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రజలకు సూచించారు. సత్యాగ్రహ పాదయాత్రతో సర్కారుపై దండయాత్రకు సమయం ఆసన్నమైందన్న భూమన.. ఉద్యమం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతున్నట్లు స్పష్టం చేశారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ఏపీ సర్కార్ కుంటి సాకులు చెబుతోందన్నారు భూమన. రెగ్యులరైజ్ చేయడానికి సుప్రీం నిర్ణయమే అడ్డుగా మారిందని ప్రభుత్వం చెబుతోందని, అదే నిజమైతే తెలంగాణలో ఎలా సాధ్యపడిందని, తెలంగాణలో అడ్డురాని నిబంధనలు ఏపీలోనే అడ్డొస్తున్నాయా అని భూమన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కదాన్ని ఇప్పటివరకు చంద్రబాబు నెరవేర్చలేదని, అందుచేత ప్రజలంతా ఆయనపై తిరగబడాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications