రాయలసీమ బిడ్డలకు ఇంత అన్యాయమా.. చోద్యం చూస్తున్నారా..
పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడ్డ రాయలసీమలో మరో భారీ కుంభకోణం బయటపడింది. న్యాయంగా రాయలసీమకు బిడ్డలకు దక్కాల్సిన మెడికల్ సీట్లను కాసుల కోసం కక్కుర్తి పడి అమ్మేసుకుంటున్నారు. అధికారులే దళారుల అవతారమెత్తి మెడికల్ సీట్ల దందాకు తెర లేపినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రముఖ జాతీయ ఛానెల్ సీఎన్ఎన్ నెట్ వర్క్ విస్మయానికి గురిచేసే కథనాన్ని వెలువరించింది.
విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ సీట్ల దందాపై నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది సీఎన్ఎన్. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన రమణ అనే వ్యక్తి ముందుగా ఈ కుంభకోణాన్ని బయటపెట్టగా ఒక్కొక్క విషయం మెల్లగా వెలుగుచూస్తోంది. ఎంసీఐ విచారణ చేస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా సీఎన్ఎన్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
సీఎన్ఎన్ కథనం ప్రకారం.. విధుప్రియ అనే అమ్మాయి మెడికల్ లో మంచి ర్యాంకు సాధించింది. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీ నుంచి కౌన్సిలింగ్ లెటర్ కూడా రావడంతో.. ఇక తనకు మెడికల్ సీటు గ్యారంటీ అని భావించింది. మెడికల్ సీటు వస్తుందన్న గంపెడంత ఆశతో కౌన్సిలింగ్ హాల్ లోకి అడుగుపెట్టిన ఆమెకు అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ముందుగా సాంకేతిక కారణాల సాకు చెప్పి గంటపాటు విధుప్రియను ఎదురుచేయించిన అధికారులు, గంట తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభమయ్యి కాగానే ఉన్న సీట్లన్ని భర్తీ అయిపోయాయని చేతులెత్తేశారు.

అధికారుల తీరుతో కన్నీరు మున్నీరైన విధుప్రియ ధీనంగా అక్కడినుంచి వెళ్లిపోయింది. మరో విద్యార్థిని సాయిశ్రీ విషయంలోను అధికారులు ఇలాగే వ్యవహరించారు. మంచి ర్యాంకు రావడంతో కర్నూల్ మెడికల్ కాలేజీలో సీటు గ్యారంటీ అని భావించిన సాయిశ్రీకి కూడా కన్నీళ్లే మిగిలాయి. సీట్లను బ్లాక్ ను చేసిన అధికారులు ఒక్కో మెడికల్ సీటును కోటి రూపాయలకు అమ్ముకున్నట్టు సీఎన్ఎన్ తెలిపింది.
ఇలా దాదాపుగా 10 మెడికల్ కాలేజీల్లో 100 సీట్లకు పైగానే బ్లాక్ చేసి అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై సీఎన్ఎన్ కర్నూల్ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని ఆరా తీయగా.. కౌన్సిలింగ్ లో అసలు తమ ప్రమేయం లేదని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచే నేరుగా ప్రవేశాలు జరిగాయని చెప్పినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే లోకల్ మీడియా కూడా ఈ మెడికల్ కుంభకోణంపై స్పందించకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications