గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆ వ్యవహారంలో ఊరట!!
కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్ట్ లో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇటీవల వల్లభనేని వంశీని అరెస్టు చేయాలంటూ కోర్టు జారీ చేసిన నాలుగు వారెంట్లను రీ కాల్ చేసింది. వల్లభనేని వంశీ కోర్టులో కేసులకు హాజరు కాకపోవడంతో గత నెలలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గాయత్రీ దేవి అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, నిన్న వంశీ విజయవాడలోని కోర్టుకు హాజరయ్యారు.
ఆయన న్యాయస్థానంలో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వల్లభనేని వంశీని , న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులను జడ్జి విచారించారు. ఇక సాక్షుల విచారణ కోసం వచ్చే నెల 4వ తేదీ నుంచి షెడ్యూల్ ను ఖరారు చేశారు. దీంతో వల్లభనేని వంశీ రీకాల్ పిటిషన్ జడ్జి ఆమోదించడంతో వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్స్ నుంచి ఊరట దొరికినట్టు అయ్యింది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఫిబ్రవరి రెండవ తేదీన అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. వల్లభనేని వంశీ పై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టు ఏకంగా నాలుగు అరెస్టు వారెంట్లను జారీ చేసింది. వల్లభనేని వంశీపై నాలుగు కేసుల్లో విచారణ జరుగుతుండగా, విచారణకు ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రసాదంపాడు లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో మొదట బెయిలబుల్ వారెంట్ ను న్యాయస్థానం జారీ చేసింది.
వారెంట్ జారీ చేసినప్పటికీ విచారణకు వల్లభనేని వంశీ హాజరు కాకపోవడంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కోర్టుకు హాజరై రీకాల్ పిటిషన్ వేయడంతో వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్ల నుండి రిలీఫ్ దొరికింది.












Click it and Unblock the Notifications