వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్..
ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి వేదికగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయ వైరం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టులో పెద్దారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ జడ్జి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తీర్పుపై అనంతపురం ఎస్పీ జగదీశ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే స్థానికంగా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలగవచ్చని వాదించారు.

ఆయన పర్యటనతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని న్యాయస్థాన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగితే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇక పోలీసుల వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తదుపరి విచారణను మూడు వారాల తరువాత చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుతానికి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications