కోడి కత్తి కేసులో భారీ ట్విస్ట్ లు- కుట్ర లేదని తేల్చిన ఎన్ఐఏ- జగన్ పిటిషన్ కొట్టేయమంటూ..
ఏపీలో గత ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి ఘటన ఇవాళ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఇవాళ విజయవాడ కోర్టులో సంచలన కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో పలు సంచలనం రేకెత్తించే అంశాలున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ కౌంటర్ రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి ఘటనలో కుట్రకోణం లేదని ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ తేల్చింది. అలాగే వైజాగ్ ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‍కు కూడా ఈ ఘటనతో ఎలంటి సంబంధం లేదన్న ఎన్ఐఏ నిర్దారించింది.ఈ కేసులో టీడీపీకి చెందిన హర్షవర్ధన్ కుట్ర చేసి దాడి చేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వీటిని ఎన్ఐఏ తోసిపుచ్చింది. అలాగే ఈ దాడి చేసిన నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కూడా టీడీపీ సానుభూతిపరుడు కాదని తేల్చింది.

మరోవైపు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడిపై కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ తన కౌంటర్ లో పేర్కొంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‍ను కొట్టి వేయాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. ఈ మేరకు కోడికత్తి కేసులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఎన్ఐఏ కౌంటర్ పై వాదనలకు మరింత సమయం కావాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

మరోవైపు ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్ లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. తనపై కోడికత్తి దాడి జరిగిన సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయలేదని వైఎస్ జగన్ తన పిటిషన్ లో చెప్పగా.. అది నిజం కాదని అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ తాము సేకరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. అలాగే ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ యజమాని పేరు కూడా హర్షవర్ధన్ చౌదరి అని జగన్ పిటిషన్ లో పేర్కొనగా.. అది తప్పని ఆయన పేరు కేవలం హర్షవర్ధన్ మాత్రమేనని కౌంటర్ లో వెల్లడించింది.












Click it and Unblock the Notifications