జగన్ నెత్తిన పాలుపోసిన నితీష్ కుమార్!!
బీహార్‌లో సంభవించిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారడానికి కారణమవుతున్నాయి. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా పడుతోంది. ఢిల్లీలో నరేంద్రమోడీతో చంద్రబాబు ఐదునిముషాలు ప్రత్యేకంగా మాట్లాడితేనే ఇరుపార్టీల మధ్య పొత్తు పొడుస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే బీహార్ లో నెలకొన్న పరిణామాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరుపార్టీల మధ్య మైత్రి చిగురిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించనుంది.

రాజ్యసభలో తగ్గిన బలం
నితీష్ నాయకత్వంలోని జేడీయూ నిష్క్రమించడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం తగ్గింది. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 237గా ఉండగా బిల్లులు నెగ్గించుకోవడానికి 119 మంది అవసరం. నితీష్ కుమార్ వెళ్లిపోవడానికి ముందు ఎన్డీయేకు 115 మంది సభ్యులుంటే వారిలో జేడీయూ సభ్యుల సంఖ్య 5. తాజా పరిణామంతో వారంతా బయటకు వెళ్లిపోవడంతో ఎన్డీయే బలం 115 నుంచి 110కి తగ్గింది. అక్టోబర్‌లో కీలక బిల్లులు ఆమోదింప చేసుకోవాలనుకుంటున్న మోడీ - షా ద్వయానికి ఇది మింగుడు పడని పరిణామంగా మారింది.

మెజారిటీకి 121 మంది కావాలి
ప్రస్తుతం ఎగువ సభలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా, అవి త్వరలోనే భర్తీ అయ్యే అవకాశం కనపడుతోంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 241 కి చేరుకుంటుంది. మెజారిటీ సాధించాలంటే ఎన్డీయే కి 121 మంది సభ్యుల బలం అవసరం. త్వరలో భర్తీ కానున్న నాలుగు స్థానాలు ఎన్డీయే ఖాతాలోనే పడే అవకాశం ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 114 దగ్గరే ఆగిపోతుంది. అప్పుడు ఏడు స్థానాలు తగ్గుతాయి.
Recommended Video


వైసీపీ అవసరం ఉంది
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్డీయేకు ఇతర పార్టీల సాన్నిహిత్యం అవసరమవుతోంది. తెలుగుదేశం పార్టీకి సభలో ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. దీనివల్ల ఎన్డీయేకు మద్దతిచ్చినా ఎటువంటి ఉపయోగం ఉండదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది. ఎన్డీయేకు అవసరమైన సమయాల్లో వైసీపీ మద్దతిస్తూ వస్తోంది. ఇకనుంచి కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో మ్యాజిక్ పిగర్ 121ని సులభంగా అధిగమించవచ్చు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొనే ఏపీ విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై కేంద్రం నుంచి ఎటువంటి వ్యాఖ్యలు వచ్చే పరిస్థితి ఉండదు.
కీలక బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందేవరకు రాజకీయ పొత్తులపై అనిశ్చితి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications